: ఎల్‌వోసీ వద్ద మేం పస్తులుంటున్నాం.. నాణ్యమైన భోజనానికి మొహం వాచిపోయాం.. సంచలనం సృష్టిస్తున్న భారత జవాన్ల వీడియోలు
భారత జవాన్లు విడుదల చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వీడియోలపై స్పందించిన ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. నిత్యం ఉద్రిక్తతలు రాజ్యమేలే నియంత్రణ రేఖ వద్ద గస్తీ కాసే తమకు అధికారులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, కొన్నిసార్లు పస్తులు కూడా ఉండాల్సి వస్తోందంటూ కొందరు బీఎస్ఎఫ్ జవాన్లు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేశారు. దాదాపు అన్ని వీడియోల్లోనూ ఇవే రకమైన ఆరోపణలు ఉన్నాయి. చేతిలో తుపాకితో ఉన్న జవాను మోహం కనిపించకుండా తలకు గుడ్డ చుట్టుకున్నాడు. సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేసిన సరుకులను పై అధికారులు అక్రమంగా మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
29వ బెటాలియన్‌కు చెందిన మరో జవాను టీబీ యాదవ్(40) పోస్టు చేసిన వీడియోలో తమకు వడ్డించిన భోజనాన్ని చూపించాడు. అల్పాహారం కింద తమకు పరాఠా, చాయ్ మాత్రమే ఇస్తారని, మధ్యాహ్నం భోజనంలో రొట్టె, పప్పు ఇస్తారని పేర్కొన్నాడు. దానిని తిని తాము 11 గంటలు నిలబడి పనిచేయాల్సి ఉంటుందని తెలిపాడు. పప్పులో పసుపు, నీళ్లు, ఉప్పు తప్ప ఏమీ ఉండవన్నాడు. తమకు పెట్టే భోజనం నాణ్యత ఇదేనని, ఈ అన్యాయాన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని కోరాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలపై స్పందించిన బీఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది.