: తిరుమలకు వస్తేనే ఆవేదన కలుగుతోంది: టీటీడీపై మోహన్ బాబు విసుర్లు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు మోహన్ బాబు, టీటీడీ అధికారుల వైఖరిపై విమర్శలు గుప్పించారు. టీటీడీకి వచ్చే ప్రతి అధికారి తనకిష్టమైన రీతిలో విధానాలను మారుస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు, గుడిలోకి వెళ్లే ముందు ధ్వజస్తంభాన్ని తాకి నమస్కరించడం సంప్రదాయమని, అధికారులు మాత్రం కొందరికే ఆ అవకాశం కలిపిస్తున్నారని ఆరోపించారు. వీఐపీలు, ముఖ్యులు మాత్రమే ధ్వజస్తంభాన్ని తాకాలని ఎక్కడ రాసుందని ప్రశ్నించిన ఆయన, స్వామి దర్శనానికి వచ్చినప్పుడల్లా తనకు ఆవేదన కలుగుతోందని అన్నారు. జరుగుతున్న మంచి, చెడును భగవంతుడు చూస్తూనే ఉన్నాడని, ఈ పవిత్ర క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదేనని అన్నారు.