: నేనేమీ ఎన్ కౌంటర్ స్పెషలిస్టును కాదు... ఏవోబీ ఎన్ కౌంటర్ ప్లాన్ చేసింది కాదు!: ఏపీ డీజీపీ
ఏవోబీ ఎన్ కౌంటర్ ప్లాన్ చేసింది కాదని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘1984లో నేను సర్వీసులోకి వచ్చాను. నక్సలైట్ల ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న సమయంలో బెల్లంపల్లిలో ఏఎస్పీగా చేశాను. అక్కడి నుంచి నిజామాబాద్.. మెదక్.. మహబూబ్ నగర్.. రంగారెడ్డి.. చాలా ప్రాంతాల్లో ఉద్యోగం చేశాను. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనే నా సర్వీసు ఎక్కువగా ఉంది. నేను పనిచేసిన ప్రాంతాల్లో ఎన్ కౌంటర్ జరిగినంత మాత్రాన నేనేమీ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు ని కాదు. ఏవోబీ ఎన్ కౌంటర్ మేమేమీ ప్లాన్ చేసింది కాదు. జనరల్ కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా జరిగిందే. నక్సల్స్ ను ఏరివేసేందుకు గ్రేహౌండ్స్, పోలీస్, ఇంటెలిజెన్స్ లు విడివిడిగా లేదా సంయుక్తంగా నిర్వహించే ప్రతి పది ప్రయత్నాల్లో ఒక్కటీ కూడా సక్సెస్ కాదు. అలాంటిది, ఏదో యాదృచ్ఛికంగా ఏవోబి ఎన్ కౌంటర్ సక్సెస్ అయింది’ అని ఆయన చెప్పుకొచ్చారు.