: విదేశాలకు వెళ్లే వారి కోసం మోదీ కొత్త స్కీమ్
విదేశాలకు వెళ్లాలని కోరుకునే భారత కార్మికులు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా 'ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన' అనే స్కీమును ప్రారంభించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న 14వ ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత కార్మికులకు దీని ద్వారా షార్ట్ టర్మ్ స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇప్పిస్తామని, దీనివల్ల విదేశాలకు వెళ్లినా అక్కడ ఇబ్బందులు పడే అగత్యం తప్పుతుందని అన్నారు.
ప్రవాస భారతీయ దివస్ లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియాలో పుట్టినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, ఏ దేశానికి వెళ్లినా స్వదేశపు విలువలను కాపాడుకోవాలని కోరారు. విదేశాలకు చట్ట విరుద్ధంగా ఉద్యోగులను పంపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నామని మోదీ హెచ్చరించారు. దేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఇమిగ్రేషన్ సెంటర్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా కూడా పాల్గొన్నారు.