: ఓ వైపు 'కొదమ సింహం', మరోవైపు 'సమరసింహం'... వీరి మధ్య పోటీ ఈనాటిది కాదు!
ఈసారి సినిమా బరిలో సంక్రాంతి మొనగాడెవరు? గత కొన్ని రోజులుగా సగటు తెలుగు సినీ అభిమానుల మధ్య జరుగుతున్న అతి పెద్ద చర్చ ఇది. ఈ ప్రశ్నకు సమాధానం మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఈ నెల 11న, ఆపై ఒక్క రోజు తేడాతో బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' 12వ తేదీన విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు సంక్రాంతికి విడుదలై పోటీపడటం ఇదే తొలిసారి కాదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే 1987లో చిరంజీవి 'దొంగమొగుడు' (జనవరి 9), బాలయ్య 'భార్గవ రాముడు' (జనవరి 14) సంక్రాంతికి పోటీ పడ్డాయి.
అప్పటి నుంచి వీరు నటించిన ఎన్నో చిత్రాలు పోటీ పడుతూనే ఉన్నాయి. 1988లో మంచిదొంగ జనవరి 14న, ఇన్ స్పెక్టర్ ప్రతాప్ జనవరి 15న విడుదల అయ్యాయి. 1997లో హిట్లర్ జనవరి 4న, పెద్దన్నయ్య జనవరి 10న, 1999లో స్నేహంకోసం జనవరి 1న, సమరసింహారెడ్డి జనవరి 13న రిలీజ్ అయ్యాయి. 2000 సంవత్సరంలో అన్నయ్య జనవరి 7న, వంశోద్ధారకుడు జనవరి 14న, 2001లో మృగరాజు, నరసింహనాయుడు జనవరి 11న విడుదలయ్యాయి. 2004లో అంజి జనవరి 15న, లక్ష్మీ నరసింహ జనవరి 14న వెండి తెరలను తాకాయి. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన సినిమాలు సంక్రాంతికి పోటీ పడలేదు. సంక్రాంతి వరకూ మాత్రం చిరంజీవి సినిమాలతో పోలిస్తే, బాలకృష్ణ నటించిన సినిమాలే ఎక్కువ విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి!