: భక్తులతో పోటెత్తుతున్న వైష్ణవాలయాలు
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కాగా, తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లతో పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరో 16 కంపార్టుమెంట్లు కూడా భక్తులతో నిండిపోయాయి. రద్దీ పెరుగుతున్నందున మాఢ వీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులను అనుమతించారు. ద్వాదశి రోజున ఆలయం మూసివేత వరకూ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు. రాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 వరకూ వీఐపీలకు దర్శనం చేయించామని, సామాన్య భక్తులకు దర్శనం నాలుగు గంటల నుంచి ప్రారంభమైందని వెల్లడించారు.
కాగా, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. బాపట్లలోని క్షీర భావన్నారాయణ ఆలయంలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేశారు.