: కేజీ మిరపకాయలు @ 2,900 రూపాయలు!
కేజీ పచ్చిమిరపకాయలు 2,900 రూపాయలంటే ఆశ్చర్యంగా వుంది కదూ? కానీ, ఇది నిజమే ... మన పొరుగు దేశం భూటాన్ లో ఇప్పుడు పచ్చిమిర్చి ఆ రేటు పలుకుతోంది. ఆ దేశ వాసులకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పచ్చిమిరపకాయలతో బాగా అవసరం ఉంటుంది. ఈ మూడు నెలల్లో 1527 టన్నుల మిరపకాయలు వినియోగిస్తారంటే... వారికి పచ్చిమిరపకాయలు ఎంత అవసరమో ఊహించండి.
కొత్త సంవత్సరానికి గుర్తుగా భూటాన్ ప్రజలు ఏటా జరుపుకునే 'లోంబా' పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకేచోట విందు భోజనం చేస్తారు. వారి విందులోకి వారికి పసందైన కూర ‘హోయెంటే’ ... దీనిని పెరుగు, పచ్చిమిరపకాయలతో కలిసి వండుతారు. భారత్ నుంచి దిగుమతయ్యే హైబ్రీడ్, టెరాన్సాని, ఆకాశి రకాల మిరపకాయలను భూటాన్ ప్రభుత్వం నిషేధించడంతో, ఇప్పుడక్కడ పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్నంటాయి.
వారి దేశవాళీ (సేంద్రియ) పచ్చిమిరపకాయలు ఈ సీజన్ లో సాధారణంగా కేజీ 900 రూపాయలకు అమ్ముతుంటారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవి కేజీ 20-25 రూపాయల వరకు ధర పలుకుతాయి. అయితే ఈసారి ‘క్లోరోఫినాల్’ అనే క్రిమిసంహారక మందు మోతాదుకు మించి ఉందన్న కారణంగా భూటాన్ వ్యవసాయ, ఆహార క్రమబద్ధీకరణ సంస్థ భారత్ నుంచి పచ్చి మిరపకాయల దిగుమతిపై గత జూన్ లో నిషేధం విధించింది.
దీంతో భూటాన్ లో పచ్చిమిర్చి ధరకు రెక్కలొచ్చాయి. అక్కడ దొరికే పచ్చిమిర్చి అమాంతం ఆకాశానికెగసి 2,900 రూపాయల దగ్గర నిలబడింది. దీంతో ఈ ఏడాది చాలా మంది భూటాన్ వాసులు సంప్రదాయ హోయెంటే వంటకానికి దూరంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. గతంలో కూడా ఇదే కారణంతో భారత్ నుంచి దిగుమతయ్యే కాలిఫ్లవర్, బీన్స్ లను కూడా భూటాన్ ప్రభుత్వం నిషేధించింది.