: కుదిరిన పొత్తు... వచ్చే వారంలో కాంగ్రెస్, ఎస్పీ (అఖిలేష్) బంధంపై ప్రకటన!
యూపీలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ (అఖిలేష్) పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య బంధం కుదిరినట్టు తెలుస్తోంది. వచ్చే వారంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుపై కీలక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య సమావేశం జరుగుతుందని, ఆ తరువాత పొత్తుపై ప్రకటన వెలువడనుందని సమాచారం.
తండ్రిని విభేదించి తనదే అసలైన సమాజ్ వాదీ పార్టీ అని ప్రకటించుకున్న అఖిలేష్, ఈసీ సూచనల మేరకు, తనకు మద్దతిస్తున్న ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను ఇప్పటికే అందించి, సైకిల్ గుర్తు తమకే చెందాలని ఆభ్యర్థించిన సంగతి తెలిసిందే.
కాగా, కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే, సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ సైతం యూపీలో ర్యాలీలు, సభలు నిర్వహించి కాంగ్రెస్, ఎస్పీలకు మద్దతుగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. 9వ తేదీ, సోమవారం నాడు అఖిలేష్, రాహుల్ లు కలసి పొత్తుపై చర్చిస్తారని రెండు పార్టీల వర్గాలూ స్పష్టం చేశాయి.