: సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య నడిచే పలు రైళ్లు రద్దు.. ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ల ఏర్పాటు
సికింద్రాబాద్-ఢిల్లీ మధ్య నడిచే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. కొన్ని రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మహారాష్ట్రలోని వీర్గామ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. భారీ క్రేన్ల సాయంతో రైల్వే సిబ్బంది గూడ్స్‌రైలు బోగీలను తొలగిస్తున్నారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల వద్ద చెన్నై-ఢిల్లీ జీటీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే అధికారులు రద్దు చేశారు. బల్లార్షా నుంచి సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. కాగజ్‌నగర్ వద్ద దర్బాంగా ఎక్స్‌ప్రెస్, నాగ్‌పూర్ ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. ప్రయాణికుల కోసం అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
రైళ్ల రాకపోకలు, ఇతర వివరాల కోసం ప్రయాణికులు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. సికింద్రాబాద్ 040-27786170, 27700868, 27786539, 27788889, ఖమ్మం 08742224541, వరంగల్ 0870-2426232, కాజీపేట 0870-2576430, 2576226, సిర్పూరు కాగజ్‌నగర్ 08738-238717. గూడ్స్ రైలు బోగీలను తొలగించి ట్రాక్ మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.