: ట్రెక్కింగ్ చేస్తున్న అమ్మాయిలపై పైశాచికత్వం... పూణే సమీపంలో యువకుల కీచకపర్వం!
ఒంటరిగానో లేదా జంటగానో కనిపించిన అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడుతున్న కామాంధుల ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. కొత్త సంవత్సరం ప్రవేశించిన వేళ, బెంగళూరులో యువతులపై జరిగిన ఉన్మాద క్రీడలను మరచిపోకముందే మహారాష్ట్రలో ఓ కొండను ఎక్కేందుకు వెళ్లిన అమ్మాయిలపై స్థానిక యువకులు జరిపిన అకృత్యం వెలుగులోకి వచ్చింది. వికృత పోకడలు మరింతగా పెరుగుతున్నాయన్న వార్తలకు బలాన్నిస్తూ, మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో పర్వతారోహణ చేస్తున్న అమ్మాయిలను మోరల్ పోలీసింగ్ అంటూ, అబ్బాయిలతో కలిసున్నారంటూ బట్టలూడదీసి మరీ కొట్టిందో ముఠా.
పుణెకు 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతోంది. శివాజీ భక్తులమని చెప్పుకున్న కొందరు యువకులు, ఇసాపూర్ కోటకు వచ్చిన వారిని చుట్టుముట్టి, ఆ బృందంలోని అమ్మాయిలను దారుణంగా వేధించారు. ట్రెక్కర్స్ బృందంలో 12 మంది ఉండగా, వారిలో యువతులూ ఉన్నారు. సమీపంలోని గ్రామాల నుంచి వచ్చిన కొందరు యువకులు, వస్తూనే వారిపై దాడికి దిగారని తెలుస్తోంది. తమది 'ఫోర్డ్ లవర్స్' గ్రూప్ గా చెప్పుకున్న వారు, భారత సంస్కృతిని పాడుచేస్తున్నారని ఆరోపిస్తూ, కీచకపర్వానికి దిగారు. అమ్మాయిల వెంటవున్న వారిని కొట్టారు. వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ, దౌర్జన్యం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన పలు చిత్రాలు, వీడియోలు వీరి అకృత్యాలను చూపిస్తుండగా, ఇంతవరకూ పోలీసులు ఎటువంటి చర్యనూ తీసుకోలేదని తెలుస్తోంది.