: యూపీలో పోలీస్ స్టేషన్ కు నిప్పు.. నిందితుల అరెస్టు
ఒక వ్యక్తి మృతికి పోలీసులే కారణమంటూ పోలీస్ స్టేషన్ కే నిప్పు పెట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. డియోరియో జిల్లాలోని మదన్ పూర్ కు చెందిన రహమతుల్లా (22) అనే యువకుడు మూడు రోజుల క్రితం తప్పిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తరపు నుంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈరోజు ఉదయం యువకుడి శవం లభ్యమైంది. దీంతో, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆగ్రహించిన యువకుడి తరపు వ్యక్తులు పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడి, నిప్పుపెట్టారు. స్టేషన్ లోని వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.
ఈ సంఘటన నేపథ్యంలో గోరఖ్ పూర్ డీజీపీ శివసాగ్ సింగ్ మాట్లాడుతూ, యువకుడి మృతదేహం లభ్యం కాగానే, కొందరు వ్యక్తులు స్టేషన్ పై దాడికి పాల్పడి, నిప్పంటించారన్నారు. ఈ కేసుకు సంబంధించి రెండు డజన్ల మందిని అదుపులోకి తీసుకున్నామని, ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారని ఆయన చెప్పారు.