: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొత్త నిబంధనలు: ఈసీ
ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు మారాయని, వాటిని గమనించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ప్రతి అభ్యర్థి విధిగా తన నామినేషన్ పత్రాలపై ఫోటోలను అతికించాలని పేర్కొంది. తాను భారత పౌరుడినేనని డిక్లరేషన్ సమర్పిస్తూ, ఇదే సమయంలో మరే దేశంలోనూ పౌరసత్వం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్రం దీన్ని అమలు చేయాలని పేర్కొంది.
ఇకపై కొత్త ప్రాజెక్టులు, నూతన సంక్షేమ పథకాలను ప్రకటించే వీలు లేదని స్పష్టంగా చెప్పింది. పారదర్శక విధానంలో ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతమని, అందుకు ప్రభుత్వాలు, విపక్ష పార్టీలు సహకరించాలని కోరింది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేసేందుకు ఈసీకి 72 గంటల సమయం పడుతుందని, పూర్తిగా ఐదు రాష్ట్రాలనూ 3 రోజుల్లోగా తమ అధీనంలోకి ఐఏఎస్ అధికారులు, కేంద్ర బలగాలు తెచ్చుకుంటాయని వెల్లడించింది. ఈసీ నిబంధనలకు ప్రతి రాజకీయ పార్టీ సహకరించాలని కోరింది. రాత్రి 10 నుంచి తెల్లారి 6 గంటల వరకూ ఎలాంటి లౌడ్ స్పీకర్లూ వాడరాదని, నిబంధనలు మీరితే చర్యలుంటాయని హెచ్చరికలను జారీ చేసింది.