: చేపను లాగాలనుకుంటే... అదే అతన్ని లాక్కెళ్లింది!
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అలాంటి విచిత్రమైన ఘటనే పశ్చిమ ఆస్ట్రేలియాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఓ యువకుడు చేపలు పట్టేందుకు గాలం చేతబట్టి బోటులో వెళ్లాడు. అతని గాలానికి ఓ చేప చిక్కింది. దీంతో, ఆ చేపను బోటులోకి లాగేందుకు అతను ప్రయత్నించాడు. అయితే, ఊహించని విధంగా ఆ చేపే అతడిని నీళ్లలోకి లాక్కెళ్లింది. చాలా దూరం అతన్ని లాక్కెళ్లిపోయింది. చివరకు అతడిని షార్క్ లు తిరిగే భయంకర ప్రాంతంలో వదిలేసింది. అతడిని లాక్కెళ్లిన చేప బరువు 400 కేజీల వరకు ఉందట.
ఈ నేపథ్యంలో, ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కొందరు ఖాళీ బోటును చూసి.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు గాలింపు చర్యలను చేపట్టారు. చివరకు, కొన్ని గంటల అనంతరం చేప లాక్కెళ్లిన వ్యక్తి ఆచూకీ కనుగొన్నారు. చల్లటి నీరు కారణంగా సదరు వ్యక్తి హైపోథెర్మియాకు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. గాలింపు బృందం కమాండర్ మాట్లాడుతూ, అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. పోయిన సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు.