: బీజేపీ మహిళా నేత ఇంటిపై బాంబులేసి, భౌతిక దాడికి దిగిన తృణమూల్ కార్యకర్తలు!
రోజ్ వ్యాలీ కుంభకోణంలో పాత్రధారులంటూ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను అరెస్ట్ చేసిన తరువాత నెలకొన్న నిరసనోద్యమం మరింత తీవ్రమైంది. బీజేపీ కావాలనే రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందని, నోట్ల రద్దును వ్యతిరేకించినందునే తమ పార్టీ వారిని వేధిస్తోందని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తృణమూల్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.
గత రాత్రి కోల్ కతాలోని ఉత్తర్ పారా ప్రాంతంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ భట్టాచార్య ఇంటిపై బాంబులతో దాడి చేశారు. మహిళా నేత అని కూడా చూడకుండా భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడి ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
బెంగాల్ లో జరుగుతున్న హింసకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు చూసీ చూడనట్టు ఊరుకుంటున్నారని, అందువల్ల బీజేపీ కార్యాలయం బయట కేంద్ర దళాలను మోహరింపజేశామని వెల్లడించారు. కాగా, గత వారంలో సినీ నటి, రాజకీయ నాయకురాలు తపస్ పాల్ ను, ఎంపీ సుదీప్ బందోపాధ్యాయను అరెస్ట్ చేసిన తరువాత పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి అదుపు తప్పుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఎంపీల అరెస్ట్ తనను షాక్ నకు గురి చేసిందని, తనను కూడా అరెస్ట్ చేయాలని మమతా బెనర్జీ సవాల్ విసిరారు. తమపై నమోదు చేస్తున్న ప్రతి కేసుపైనా న్యాయపోరాటం చేస్తామని ఆమె అన్నారు.