: కొత్త నోట్ల పంపిణీలో గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం... కీలక నిర్ణయం తీసుకున్న రిజర్వ్ బ్యాంక్
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. ఇక నుంచి వచ్చే కొత్త నోట్లలో 40 శాతాన్ని గ్రామీణ ప్రాంతాలకు పంపాలని బ్యాంకులను ఆదేశించింది. ఆశించిన స్థాయిలో నోట్లు గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదని గుర్తించిన ఆర్బీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలకు 40 శాతం నోట్లను పంపడం ద్వారా నగదు కొరత సమస్యకు కొంత మేర అడ్డుకట్ట పడుతుందని ఆర్బీఐ భావిస్తోంది. అంతేకాదు రూ. 100 నోటు కన్నా చిన్న నోట్లను సైతం గ్రామీణ ప్రాంతాలకు పంపాలని ఆదేశించింది. ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు నోట్ల సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.