: నోట్ల రద్దుతో ఖజానా నిండా డబ్బొచ్చిందిగా? ఇక తీయండి!: మోదీకి పవన్ సూచన
ఇప్పటివరకూ నిధులు లేవంటూ, కిడ్నీ సమస్యకు కారణాలు తెలుసుకోవడంపై మీనమేషాలు లెక్కబెట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. వేలాది మందిని పీడిస్తున్న సమస్య పరిష్కారానికి నిధుల లేమిని సాకుగా చూపారని విమర్శించిన ఆయన, నోట్ల రద్దుతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్దకు చేరాయని గుర్తు చేస్తూ, ఇకనైనా ఆ నిధులతో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
"నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే అడుగుతున్నా... డీమానిటైజేషన్ పేరు చెప్పి, ప్రజల నుంచి డబ్బులంతా తీసుకుని బ్యాంకుల్లో వేసుకున్నారు. ఇప్పుడు బోలెండంత డబ్బుంది మీ దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా పుష్కలంగా నిధులున్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ రూ. 6 వేల కోట్ల వరకూ ఉంది. వీటిల్లో డాక్టర్లు చెబుతున్నట్టుగా 30 కోట్లో, 40 కోట్లో లేకుంటే వంద కోట్లో... ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరొక వంద కోట్లు కేటాయించడానికి ఏం?" అని ప్రశ్నించారు.