chandrababu: నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా ఆనందపడలేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంతగా ఆనందపడలేదని, ఈ రోజు తనకు అంతగా ఆనందం లభిస్తోందని అన్నారు. ఎత్తిపోతల పథకంతో ఎన్నో గ్రామాలు లాభపడతాయని ఆయన అన్నారు. ఈ రోజు ఒక సుదినం అని, ఎంతో సంతోషించగల రోజు అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరంతో పాటు ఎత్తిపోతల పథకం ద్వారా అక్కడి ప్రాంతాలన్నీ కరవురహితంగా మారుతాయని చెప్పారు. రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కవ్యక్తికి నీళ్లు అందుతాయని చెప్పారు.
తాను ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదని చంద్రబాబు చెప్పారు. వందల ఏళ్లుగా రాయలసీమ అంటే పేదల సీమ అని, 'వీరి బతుకులు మారవు, ఇంతే' అంటూ అందరూ సరిపెట్టుకున్నారని ఆయన చెప్పారు. తాను మాత్రం అలా అనుకోలేదని, ఎంతో అన్వేషణ చేశానని చెప్పారు. చరిత్ర తిరగరాసే వరకు నిద్ర పోకూడదని ఎంతో కృషి చేశానని చెప్పారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా నీళ్లు ఇవ్వగలిగామని చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయని అన్నారు.