: దోమకాటుతో చనిపోయినా బీమా సొమ్ము చెల్లించాల్సిందే.. వినియోగదారుల కమిషన్ సంచలన ఆదేశం
జాతీయ వినియోగదారుల క్లేశ నివారణ కమిషన్ సంచలన ఆదేశం జారీ చేసింది. దోమ కాటు కూడా ప్రమాదం కిందికే వస్తుందని, కాబట్టి దోమ కాటు కారణంగా మరణించిన వారికి బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. దోమ మనకు చెప్పి కుట్టదు కాబట్టి, దానిని అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంగానే భావించాలని పేర్కొంది. దోమకాటు మరణాలను ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా అంగీకరించడం కొంచెం కష్టమైన పనే అయినా దోమ కుడుతుందని ఎవరూ ముందుగా ఊహించరు కాబట్టి అది ప్రమాదం కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. ఆ మరణాలకు బీమా సొమ్ము చెల్లించాల్సిందేనని పేర్కొంది.
బీమా కంపెనీలు తమ వెబ్‌సైట్లలో కుక్కకాటు, గడ్డకట్టే చలికి చనిపోవడం వంటి వాటిని మాత్రమే ప్రమాదాలుగా పేర్కొన్నాయని, కానీ దోమకాటు కారణంగా వచ్చే మలేరియాను వ్యాధిగానే పరిగణిస్తున్నాయని పేర్కొంది. ఇక నుంచి దీనిని కూడా ప్రమాదంగానే పరిగణించాలని, బీమా సొమ్మును చెల్లించాలని జస్టిస్ వీకే జైన్ ఆదేశించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌసమీ భట్టాచార్జీ భర్త దేవాశిష్ కేసు విచారణ సందర్భంగా వినియోగదారుల కమిషన్ ఈ తీర్పు చెప్పింది.