: 12 గంటల వ్యవధిలోనే సమూలంగా మారిపోయిన యూపీ రాజకీయం... అఖిలేష్ ఎత్తుగడ ఏమిటి?
తన తండ్రిని కాదని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఉదయం వేసిన అడుగు దేశంలోని రాజకీయ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత, ప్రజాబలం తనవెంటే ఉందని చూపిన అఖిలేష్, నిన్న సాయంత్రం తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు దగ్గరయ్యారు. ఆయనతో మాట్లాడి విభేదాలన్నీ పరిష్కరించుకున్నట్టే కనిపించారు.
అయితే, రాత్రి ఏం జరిగిందో ఏమో కానీ, పొద్దున్నే జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు రాంగోపాల్ యాదవ్ ప్రకటించడం, సమావేశంలో అఖిలేష్ ను జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ, తీర్మానం ప్రవేశపెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అత్యధిక ఎమ్మెల్యేల మద్దతును సంపాదించుకోడవంలో సఫలీకృతుడైన అఖిలేష్, ఇంత అర్థాంతరంగా పార్టీ పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకోవాలని భావించడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.
తన వర్గం వారిని, యువతను కాదని రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున నేరస్తులు, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు ఇవ్వాలని శివపాల్ యాదవ్ తన వాటా జాబితాను అందించడంతో అఖిలేష్ ఆగ్రహంగా ఉన్నారని, దాని ఫలితమే తాజా ఎత్తుగడని తెలుస్తోంది. టికెట్లను శివపాల్ అమ్ముకున్నారన్న ప్రచారం జరుగుతుండటం, వారికి సీట్లిస్తే గెలవడం కష్టమన్న ఉద్దేశంతో ఉన్న అఖిలేష్, సీట్లన్నీ తనవారికే ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నట్టు సమాచారం. పార్లమెంటరీ కమిటీని, ముఖ్యమంత్రినైన తనను సంప్రదించకుండానే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను శివపాల్ ఖరారు చేయడం కూడా తాజా పరిణామాలకు కారణమని సమాచారం. ఏదిఏమైనా, సమసిపోయిందనుకున్న సంక్షోభం 12 గంటల వ్యవధిలోనే తిరిగి రాజుకోవడం గమనార్హం.