: నా హృదయంలో కనిపించేది అమ్మ ఒక్కరే: శశికళ
ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం జనరల్ సెక్రటరీగా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జయలలిత, ఎంజీఆర్ లు కుల, మతాలకు అతీతంగా ఎదిగిన నేతలని కొనియాడారు. వారు చూపిన దారిలోనే తానూ నడుస్తానని తెలిపారు. అమ్మ తన హృదయంలో ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. జనవరి 17 నుంచి ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు మొదలవుతాయని, ఈ వేడుకలను వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎంజీఆర్ గౌరవార్థం ఓ స్టాంపును విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు శశికళ తెలిపారు. కాగా, శశికళ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు పాదాభివందనం చేసేందుకు, అభినందనలు తెలిపేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడ్డారు.