: ములాయం సింగ్ యాదవ్ ఇంటిపోరు, సమాజ్ వాదీ సంక్షోభాన్ని చక్కదిద్దిందెవరో తెలుసా?
సమాజ్ వాదీ పార్టీతోపాటు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను పట్టి కుదిపేసిన కలకలం టీకప్పులో తుపానులా చల్లబడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్! బీహార్ లో ఉండే లాలూప్రసాద్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లో ఏర్పడిన సంక్షోభాన్ని ఎలా పరిష్కరించారన్న అనుమానం వచ్చిందా? ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించానని ఆయన చెప్పారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, సమాజ్ వాదీ నేతలతో మాట్లాడానని అన్నారు. ఇంటిపోరుతో రచ్చకెక్కవద్దని సూచించానని అన్నారు. వివాదంతో పార్టీని చీల్చి ప్రత్యర్థులకు గెలిచే అవకాశం ఇవ్వవద్దని ఆయన సూచించారు. మీ కలహాలు విరోధులకు విజయం చేకూరుస్తాయని హెచ్చరికలు జారీ చేశానని ఆయన చెప్పారు.
పార్టీని పెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చింది, అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దిందీ ములాయం సింగ్ యాదవే కాబట్టి, ప్రస్తుత సమస్యకు పరిష్కారం వెతకాల్సిన బాధ్యత కూడా ములాయందేనని స్పష్టం చేశానని ఆయన అన్నారు. అఖిలేష్ పై బహిష్కరణ వేటు ఎత్తివేసిన వార్త తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన తెలిపారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ సోదరుడి కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు తన కుమార్తెనిచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ వివాహం జరిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే జరిగిన సమాజ్ వాదీ వ్యవస్థాపక దినోత్సవానికి లాలూ ముఖ్యఅతిథిగా హాజరై యూపీ ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేయదని, ములాయం పార్టీకి మద్దతిస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.