: మగాళ్లూ బహుపరాక్! మెట్రో రైళ్లలోని లేడీస్ కోచ్‌లలో కనిపించారో రూ. 5వేల జరిమానా!
మెట్రో రైళ్లలో ప్రయాణించే మగాళ్లు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. పొరపాటుగానో, గ్రహపాటుగానో లేడీస్ కోచ్‌లలో ఎక్కారో రూ. 5 వేలు జరిమానాగా చెల్లించుకోవాల్సిందే. 12 ఏళ్లు దాటిన అబ్బాయిలు కానీ, మద్యం మత్తులో ఉన్న పురుషులు కానీ మెట్రో రైళ్లలోని లేడీస్ కోచ్‌లలో కనిపిస్తే రూ.5వేల జరిమానా విధించేందుకు కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేశంలోని మెట్రో రైలు కలిగి ఉన్న అన్ని నగరాల్లోనూ ఇది వర్తిస్తుందని అందులో పేర్కొంది. ఈ మేరకు సిద్ధం చేసిన మెట్రో రైల్ బిల్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.
లేడీస్ కోచ్‌లలో ప్రయాణిస్తూ దొరికిన పురుషులకు భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నారు. విద్రోహ చర్యలకు పాల్పడడం, ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి నేరాలకు జీవిత కాల జైలు శిక్ష లేదంటే పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అలాగే రైలులో తినడం, కోచ్‌లను అపరిశుభ్రంగా మార్చేవారికి రూ. వెయ్యి జరిమానా విధించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.