: కుమారుడు అఖిలేశ్‌పై వేటు వేసేముందు విలేకరుల సమక్షంలో ఏం జరిగిందంటే..?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, తనయుడు అఖిలేశ్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు విలేకరుల సమావేశంలో ములాయం ప్రకటించడానికి ముందు చిన్న హైడ్రామా నడిచింది. దీనిని విలేకరులు పసిగట్టడంతో బయటకు వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ములాయం ప్రకటించారు.
విలేకరుల సమావేశానికి ఆయన మరో సోదరుడు శివపాల్ యాదవ్ కూడా హాజరయ్యారు. రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన మరుక్షణమే కుమారుడు అఖిలేశ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాలని శివపాల్ యాదవ్.. ములాయం చెవి కొరకడం అందరికీ కనిపించింది. మరి, ఆ విషయం ఉన్న పేపర్ ఏదని ములాయం.. శివపాల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆ విషయం టైప్ అవుతోందని, రావడానికి కొంత సమయం పడుతుందని, కాబట్టి అఖిలేశ్ బహిష్కరణ విషయం కూడా ఇప్పుడే చెప్పేయాలని ఆయన పట్టుబట్టారు. దీంతో పేపర్ చేతికి అందకుండానే కుమారుడిని కూడా ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ములాయం ప్రకటించారు. ములాయం, శివపాల్ ముచ్చట కెమెరాలకు చిక్కడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.