: రైతు ఖాతాలో రోజూ కోటి రూపాయలు జమ.. ఆ వెంటనే విత్‌డ్రా!
తన బ్యాంకు ఖాతాలో రోజూ కోటి రూపాయలు జమ అవుతుండడం, ఆ వెంటనే డ్రా కావడంతో ఓ రైతుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఈ విషయాన్ని మీడియాకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. కర్నూలు జిల్లా పెద్దకడబూరుకు చెందిన అబ్రహం అనే రైతుకు స్థానికంగా ఉన్న ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 24 నుంచి ఆయన ఖాతాలో రోజూ రూ.కోటి జమ అవుతున్నట్టు, వెంటనే డ్రా అవుతున్నట్టు అతడి మొబైల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియని ఆయన తన స్నేహితుడు అయిన ఆల్‌ప్రెడ్ రాజుకు ఈ విషయం గురించి చెప్పాడు.
ఆయన శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విషయాన్ని వివరించారు. రైతు సెల్ నంబర్ 99890 50379కు వస్తున్న మెసేజ్‌లను విలేకరులకు చూపించారు. మొత్తం 68 మెసేజ్‌లు వచ్చాయని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కూడా రూ.1,96,07926 జమ అయినట్టు సాయంత్రం రూ. 1,33,48781 డ్రా అయినట్టు మెసేజ్‌లు వచ్చాయని వివరించారు. నగదు జమ, ఉప సంహరణపై అధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించాలని ఆయన అధికారులను కోరారు.