: దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ రాజీనామా!
దేశంలో తొలి ట్రాన్స్ జెండర్ ప్రిన్సిపాల్ మనబి బందోపాధ్యాయ రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లాలో కృష్ణా నగర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా 2015, జూన్ 9న ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కళాశాల సిబ్బంది, విద్యార్థుల సహకారం ఆమెకు లభించలేదు. అంతేకాకుండా, ఆమెపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు తలెత్తాయి. ఇద్దరు ప్రొఫెసర్లు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఈ నెల మొదటివారంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో, కళాశాల పాలకవర్గం, విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా, ఆందోళనకు దిగడంతో వారం రోజుల పాటు తరగతులు జరగలేదు. దీని ఫలితంగానే మనబి బందోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం మనబి బందోపాధ్యాయ మాట్లాడుతూ, ఎన్నో ఆశలతో వచ్చిన తాను ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యాభై సంవత్సరాల మనబి లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకోక ముందు పేరు సోమనాథ్. 2003లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రోజుల్లోనే లింగమార్పిడి చేయించుకోవడం జరిగింది.