: అత్యంత దారుణం... ఢిల్లీలో ప్రతి నాలుగు గంటలకూ ఒక రేప్ జరుగుతోంది!
దేశ రాజధాని ఢిల్లీలో మహిళల మాన, ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. ప్రతి నాలుగు గంటలకూ ఓ మహిళపై అత్యాచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఢిల్లీ పోలీసుల నేర గణాంకాల పట్టిక వెల్లడించింది. గతంతో పోలిస్తే ఢిల్లీలో నేరాల సంఖ్య తగ్గినప్పటికీ... అత్యాచారాలపర్వం మాత్రం అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతోంది. 2016లో మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి ఢిల్లీలో 4,005 కేసులు నమోదయ్యాయి. వాటిలో 2,029 కేసులు రేప్ కేసులే కావడం ఆందోళన కలిగించే అంశం. అత్యాచారం కేసుల్లో ఎక్కువగా నమ్మించి, మోసం చేసినవే ఉన్నాయి. పెళ్లి చేసుకుంటామని మాయ మాటలు చెప్పి, తమపై లైంగిక దాడి చేశారంటూ చాలా కేసులు నమోదయ్యాయి. 44 రేప్ కేసుల్లో కుటుంబసభ్యులే దారుణానికి ఒడిగట్టారు. 189 కేసుల్లో బంధువులు అత్యాచారం జరిపారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే... అత్యాచారానికి గురైన వారిలో 816 మంది అభంశుభం తెలియని బాలికలు కావడం.