: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి షాక్... పార్టీ నుంచి సస్పెన్షన్
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూకు షాక్ తగిలింది. ఆయనతో పాటు ఏడుగురు నేతలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. పెమా ఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ లతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రాథమిక సభ్యత్వాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కఫియా బెంగియా నిన్న రాత్రి ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో వీరందరినీ సస్పెండ్ చేస్తున్నామని... పార్టీ ఇతర నేతలు ఎవరూ వారితో సంబంధాలు కొనసాగించరాదని బెంగియా ఆదేశించారు.
గత సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ.... పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి, ఎన్డీఏ మిత్రపక్షమైన పీపీఏలో చేరారు. అప్పటి నుంచి పెమా ఖండూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.