: ఆ అభిమాని చేసిన పనికి ‘రకుల్’ ఇలా ఫీలయింది!
తమ అభిమాన నటీనటుల సినిమాలు చూసి సంతోషపడేవారు కొందరు. వారి సినిమాలతో పాటు, వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కనబరిచే అభిమానులు మరికొందరు. ఇక, పొద్దున్న లేస్తే తమ అభిమాన నటుల ధ్యాసే ఉండే వారు ఇంకొందరు. ఈ కోవకే చెందిన ఒక అభిమాని తనకు ఎంతో ఇష్టమైన నటి సీరత్ కపూర్ పేరులో మొదటి అక్షరం ‘ఎస్’ను తన చేతిపై గాటుగా పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని సీరత్ కపూర్ కు తెలియజేస్తూ, ఒక ఫొటో కూడా ఆమెకు పంపాడు.
దీనిని చూసి చలించిపోయిన సీరత్, ‘ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి. జీవితం ఎంత విలువైందో, మీరు కూడా అంతే విలువైన వారు. ఎవరి కోసమో మీకు మీరు హాని చేసుకోవద్దు’ అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఆ ట్వీట్ ను చూసిన అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘ఈ విషయం చాలా కలవరపరిచింది. దయచేసి, మీ జీవితానికి విలువ నివ్వండి..’ అని ఆ అభిమానికి రకుల్ సూచించింది. కాగా, ‘రన్ రాజా రన్’, ‘కొలంబస్’, ‘టైగర్’ చిత్రాల్లో నటి సీరత్ కపూర్ నటించింది.