: శశికళ పుష్ప భర్త లింగేశ్వర్ తిలకన్‌పై అన్నాడీఎంకే కార్యకర్తల దాడి.. రక్తమోడుతున్నా వదిలిపెట్టని వైనం
రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే నుంచి సస్పెండైన శశికళ పుష్ప భర్త లింగేశ్వర్ తిలకన్‌పై అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు దాడి చేసి చితకబాదారు. రక్తమోడుతున్నా వదిలి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ముష్టిఘాతాలు కురిపించారు. నోరు, ముక్కులో నుంచి రక్తం కారుతున్నా ఆయనను వదిలిపెట్టలేదు. చివరికి పోలీసులు ఆయనను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.
నేడు జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యర్శిని ఎన్నుకోనున్నారు. ఈ పదవికి శశికళ పుష్ప కూడా పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం శశికళ భర్త లింగేశ్వర్ ఐదుగురు న్యాయవాదులతో కలిసి స్థానిక రాయపేటలో ఉన్న అన్నాడీఎంకే కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాన్ని కొనుగోలు చేశారు. దానిని పూర్తిచేసి శశికళ పుష్ప తరపున నామినేషన్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడిచేశారు.
పార్టీ కార్యాలయంలో ఆయన విధ్వంసం సృష్టించేందుకు, గొడవులు పెట్టేందుకే వచ్చారని ఆరోపిస్తూ ముష్టిఘాతాలు కురిపించారు. భర్తపై దాడి జరుగుతున్న సమయంలో శశికళ పుష్ప కార్యాలయం బయట కారులోనే ఉన్నట్టు సమాచారం. కాగా తన భర్త కనిపించడం లేదంటూ శశికళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అన్నాడీఎంకే కార్యకర్తలు కూడా శశికళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.