: ‘బెర్చ్’ ఉద్యోగులకు బోనస్ గా విహారయాత్ర !
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉన్న వాటర్లూ లో ప్రముఖ ఫర్నిచర్ తయారీ సంస్థ ‘బెర్చ్’ తమ ఉద్యోగులకు ‘బోనస్’ ప్రకటించింది. అయితే, ఈ ‘బోనస్’ను క్యాష్ రూపంలో కాకుండా, విహారయాత్ర రూపంలో వారికి అందించాలని భావించింది. ఆ విహారయాత్ర కూడా సాదాసీదాది కాదు. క్రూజ్ ఓడలో కరిబియన్ ద్వీపాలకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ‘బెర్చ్’ సహ యజమాని గ్యారీ బెర్చ్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి 8న తమ సంస్థలో పనిచేసే మొత్తం 800 మంది ఉద్యోగులు మియామికి నాలుగు విమానాల్లో చేరుకుంటారన్నారు.
అక్కడి నుంచి క్రూజ్ ఓడలో ప్రయాణించి కరిబియన్ ద్వీపాలకు వెళతామని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సుదీర్ఘకాలం తర్వాత తమ సంస్థ లాభాలబాట పట్టిందని, ఉద్యోగుల శ్రమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు, సరదాగా గడిపేందుకే ఈ విహార యాత్రను ప్లాన్ చేశామని చెప్పారు. కాగా, 1977లో నెలకొల్పిన ‘బెర్చ్’కు, ఫర్నిచర్ రంగంలో, ముఖ్యంగా అమెరికాలో మంచి గుర్తింపు ఉంది. 1989లో ఒకసారి తమ సంస్థ ఉద్యోగులను విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత సదరు సంస్థ నష్టాల బాట పట్టింది. అయితే, చాలా సంవత్సరాల తర్వాత ‘బెర్చ్’ లాభాలను ఆర్జించడంతో ఉద్యోగుల కోసం ఈ విహారయాత్రను ఏర్పాటు చేసింది.