: కొత్త సంవత్సరంలో ఇదో లాభం... గృహ రుణ సంస్థల మధ్య పోటీ తీవ్రం.. తగ్గనున్న వడ్డీ రెట్లు!
కొత్త సంవత్సరంలో సొంతిల్లు సమకూర్చుకోవాలని కలలు కంటున్నారా? మీ కలలు మరింత సులభంగా తీరుతాయని అంటున్నారు నిపుణులు. నోట్ల రద్దు తరువాత ఏర్పడిన ప్రభావంతో, గృహ రుణాల సంస్థల మధ్య పోటీ తీవ్రమై, వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి. ఇండియాలో గృహ రుణాలందిస్తున్న ప్రధాన కంపెనీలైన హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ), ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, డీహెచ్ఎఫ్ఎల్ వంటి కంపెనీలు ఒకటి, రెండు వారాల్లో పావు నుంచి అర శాతం వరకూ వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయాలను ప్రకటించనున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఈ కంపెనీలన్నీ డిసెంబర్ లో ఎంతో కొంత మేరకు వడ్డీ రేట్లు తగ్గించినవే కావడం గమనార్హం. అయినా, కస్టమర్ల నుంచి రుణాల కోసం డిమాండ్ పెరగకపోవడంతో మరింతగా వడ్డీని తగ్గించాలని ఇవి భావిస్తున్నాయి. నోట్ల రద్దు తరువాత, బాండ్ మార్కెట్ నుంచి సులభంగా నిధుల సేకరణ జరుగుతోందని, ఆ ప్రయోజనాలను రుణ గ్రహీతలకు అందించాలని నిర్ణయించామని ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ గగన్ బంగా వెల్లడించారు. వచ్చే సంవత్సరంలో నూతన ఇండ్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
వడ్డీ రేట్లు తగ్గితే, మరింత మంది రుణాలు తీసుకునేందుకు ముందుకు వస్తారని భావిస్తున్నట్టు ఇండియాలో అత్యధికంగా గృహ రుణాలు అందిస్తున్న హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ వివరించారు. అక్టోబరులో 8 శాతానికి పైగా వడ్డీని ఆఫర్ చేస్తూ బాండ్లను విక్రయించి రూ. 1000 కోట్లను సమీకరించిన హెచ్డీఎఫ్సీ, నవంబరులో 7.8 శాతం వడ్డీకే రూ. 2 వేల కోట్లను సమీకరించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, నోట్ల రద్దు తరువాత కొంత మేరకు నల్లధనం భారత నిర్మాణ రంగంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కొంతమంది తమ వద్ద ఉన్న అక్రమ ధనంతో స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసినట్టు గుర్తించిన అధికారులు వారిని విచారించాలని భావిస్తున్నారు.