: ఇండియాలో నల్లధనం ఉంటే ఎక్కడ? మోదీ ప్లాన్ విఫలమేనా?
పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా నల్లధనాన్ని రూపుమాపవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ తో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. 2017 సంవత్సరంలో కనీసం మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యవస్థలోని ధనం బ్యాంకులకు రాకుండా ఉండిపోతుందని, అంత మొత్తం డబ్బుతో వివిధ సంక్షేమ పథకాలు చేపట్టవచ్చని మోదీ భావించారు.
కానీ, దేశంలో అంత పెద్ద మొత్తంలో బ్యాంకులకు రాని ధనం ఉండదని ఇప్పుడు తేటతెల్లమైంది. నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు రూ. 500, రూ. 1000 విలువైన నోట్లు రూ. 15.4 లక్షల కోట్లు ఉన్నాయి. నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, ప్రజల వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని కోరిన తరువాత, ఇప్పటివరకూ రూ. 14 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం అంచనా వేసినట్టు కనీసం రూ. 3 లక్షల కోట్లు కాదు కదా... రెండు లక్షల కోట్లు కూడా మిగలని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో భారీ ఎత్తున ఆర్బీఐ నుంచి డివిడెండ్ పొందాలన్న కేంద్రం ఆశ అడుగంటిపోయింది.
ఇప్పుడిక ప్రభుత్వం వద్ద మిగిలిన మరో ఆశ... ఆదాయపు పన్ను. నోట్ల రద్దు తరువాత రూ. 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేసిన వ్యక్తిగత ఖాతాలపై దృష్టిని పెట్టి, వారి నుంచి ఆదాయపు పన్నును ముక్కు పిండి వసూలు చేయడం తప్ప మరో మార్గం లేదని ఆర్బీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇళ్లల్లో దాచుకున్న చిన్న చిన్నమొత్తాలను బ్యాంకుల్లోకి డిపాజిట్ చేయించడం ద్వారా కొంత నిధులు వస్తాయని కేంద్రం భావిస్తోంది.
స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వెల్లడించి, 50 శాతం జరిమానాగా కేంద్రానికి చెల్లించే మొత్తంపైనే మోదీ సర్కారు ఆశలు పెంచుకుంటోంది. వారి ఖాతాల్లో నాలుగేళ్ల పాటు లాకిన్ పీరియడ్ గా ఉండే 25 శాతం నల్లధనాన్ని వాడుకుని పేదల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. అంతకుమించి, మోదీ సర్కారుకు కొత్త సంవత్సరం బహుమతిగా భారీ మొత్తంలో నిధులు లభించే అవకాశం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.