: నోట్ల రద్దు అనంతరం కారు కొనుగోలు చేసినా ఐటీ నోటీసులు?
పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డ నవంబర్ 8వ తేదీ తర్వాత కార్లు కొనుగోలు చేసిన వారికీ నోటీసులు తప్పవట. నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా పలు చోట్ల విస్తృత సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ దృష్టి కార్ల అమ్మకాలపై పడింది. నవంబర్ 8 తర్వాత దేశంలో ఎన్నికార్లు విక్రయించారనే వివరాల గురించి తెలుసుకునే పనిలో ఐటీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న కార్ల డీలర్లకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నవంబర్ 8 తర్వాత కార్లు కొనుగోలు చేసే వారు ఆయా తేదీలను మార్చుకుంటారనే అనుమానాన్ని కూడా సంబంధిత అధికారులు వ్యక్తం చేశారు. ఎంట్రీ పుస్తకాల్లో పాత తేదీలను కూడా తనిఖీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న కార్ల డీలర్లు..అమ్మకాలకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖ అధికారులకు అందజేస్తున్నారు.