: చైనాకు నిద్ర లేకుండా చేస్తున్న అగ్ని-5 ఎక్కడ తయారైందో... ఎంతమంది నిద్రాహారాలు మానేసి పని చేశారో తెలుసా?
భారత అమ్ములపొదిలోనే అత్యంత శక్తిమంతమైన అగ్ని-5 క్షిపణి చైనాకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తోంది. శత్రువుల రాడార్లకు కూడా అంత తేలిగ్గా దొరక్కుండా... నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయడం ఈ ఖండాంతర క్షిపణి గొప్పదనం. అధికారికంగా దీని రేంజ్ 5వేల కిలోమీటర్లు. అనధికారికంగా (చైనా రక్షణ నిపుణుల అంచనా ప్రకారం) దీని రేంజ్ 8వేల కిలోమీటర్లు. మొత్తం చైనానే కాకుండా, యూరప్ లోని అనేక ప్రాంతాలను కూడా అగ్ని-5 టార్గెట్ చేయగలదు.
అయితే, తెలుగువారిగా మనం గర్వంచదగ్గ అంశం ఏమిటంటే... అగ్ని-5ను మన హైదరాబాదులోని కంచన్ బాగ్ లో ఉన్న డీఆర్డీవోలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. 200 మంది శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని అభివృద్ధి చేసేందుకు రాత్రీ పగలూ కష్టపడ్డారు. గతంలో అగ్ని సిరీస్ లోనే పని చేసిన మరో 100 మంది శాస్త్రవేత్తలు దీని రూపకల్పన కోసం తమ శక్తియుక్తులు, అనుభవాన్ని ధారపోశారు. వీరికి తోడు మరికొందరు యువ సైంటిస్టులు, విద్యారంగ నిపుణులు కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. ఈ క్షిపణి విడిభాగాలు కూడా హైదరాబాదులోనే తయారయినట్టు సమాచారం. డీఆర్డీఎస్, ది అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్, అడ్వాన్స్ డ్ సిస్టమ్ లేబొరేటరీలు ఇచ్చిన డిజైన్లను ఇక్కడే తయారు చేశారట.
ఇక్కడ తయారైన అగ్ని-5 క్షిపణిని అర డజను భాగాలుగా విడగొట్టి... అత్యంత రహస్యంగా, అత్యంత భద్రత మధ్య రోడ్డు మార్గాన ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి (వీలర్స్ ఐలాండ్)కి తరలించారు. అక్కడ ఈ భాగాలన్నింటినీ తిరిగి కలిపి... క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.