: మా ఇద్దరికీ ఏముందబ్బా?... తెలియకుండా వచ్చినాడులే, మా ఇంటికొస్తే టిఫిన్ పెడతా!: శ్రీనివాసగౌడ్ ను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి
తనకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ కూ మధ్య ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేవని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, తెలంగాణలోని ప్రైవేటు బస్సు యజమానులు ఏదో చెబితే దాన్ని నమ్మి తెలియకుండా గౌడ్ వచ్చారని అన్నారు. తన బస్సులకు సంబంధించిన అన్ని ఆధారాలతో తాను వచ్చానని చెప్పారు.
ఆయన ఇంటికి వెళ్లడానికి తాను సిద్ధమేనని చెబుతూ, "మా ఇద్దరికీ ఏముందబ్బా? ఆయన ఇంటికి నేను వెళితే, టీ ఇస్తాడు. మా ఇంటికి ఆయన వస్తే టిఫిన్ పెడతాను. ఆయన ఎమ్మెల్యేగా... కెన్ టాక్ ఎనీథింగ్. పర్టిక్యులర్ గా మా పేరు చెప్పాడు కాబట్టి నేను వచ్చాను. ప్రైవేటు ట్రావెల్స్ అనివుంటే వచ్చే వాడిని కాదు. నాకు శ్రీనివాసగౌడ్ తో ఏముంది? ఓన్లీ థింగ్ ఈజ్... నా పేరు ఎత్తినారు. ప్రైవేటు ఆపరేటర్ అంటే నేను ఒక్కడినేనా ఉన్నది? మధ్యలో తెలంగాణ అంటడు. మేమంతా తెలంగాణ రిజిస్టర్డ్ ఆపరేటర్లమే. ఆంధ్రా బండ్లని పేరే, యాక్చువల్ గా మా రిజిస్ట్రేషన్స్ ఇక్కడివే. టాక్స్ కట్టేది కూడా ఇక్కడే. ఆదాయం తెలంగాణదే" అని చెప్పారు.