: ఆమ్ ఆద్మీ పార్టీకి ఐటీ అధికారుల నోటీసులు
తమ అధికార వెబ్ సైట్ నుంచి విరాళాలు ఇచ్చిన వారి వివరాలను తొలగించినందుకు కారణాలు చెప్పాలంటూ, ఆదాయపు పన్ను శాఖ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు పంపించింది. పేర్లను ఎందుకు తొలగించారో వెల్లడించాలని ఆదేశించారు. ఐటీ నోటీసులపై ఆప్ స్పందిస్తూ, మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తమ పార్టీని వేధిస్తోందని ఆరోపించారు. కేవలం సాంకేతిక తప్పిదం కారణంగానే విరాళాలు ఇచ్చిన వారి జాబితా వెబ్ సైట్లో కనిపించడం లేదని, పార్టీ దాతల వివరాలు పూర్తి పారదర్శకమని ఆప్ ట్రెజరర్ రాఘవ్ చద్ధా వ్యాఖ్యానించారు. ఐటీ దాఖలును రివైజ్ చేసుకునే హక్కు రాజకీయ పార్టీకి ఉందని, తమకు అందే నిధుల గురించిన పూర్తి సమాచారం ఐటీ విభాగానికి తెలుసునని చెప్పారు. కాగా, తమకు వచ్చే విరాళాల్లో 8 శాతం మాత్రమే నగదు రూపంలో వచ్చాయని, కాంగ్రెస్, బీజేపీల విరాళాల్లో 80 శాతం వరకూ నగదు రూపంలో వచ్చినవేనని కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించారు.