: సోనీ మ్యూజిక్ ఘోర తప్పిదం...బ్రిట్నీ స్పియర్స్ ప్రమాదంలో మరణించినట్టు ట్వీట్
ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సోనీ ఘోరతప్పిదం చేసింది. ప్రముఖ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ మృతి చెందిందని ట్వీట్ చేసింది. బ్రిట్నీ స్పియర్స్ ఒక ప్రమాదంలో మృతి చెందినట్టు పుకార్లు వెల్లువెత్తడంతో స్పందించిన సోనీ మ్యూజిక్ ఆమె మృతి చెందిందని, మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ ఛానెల్ నేరుగా బ్రిట్నీ స్పియర్స్ ను సంప్రదించి, ఆమె మృతి చెందలేదని, క్షేమంగా ఉన్నారని తెలుపుతూ కథనం ప్రచురించింది. దీంతో ఆమె అభిమానులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే సోనీ మ్యూజిక్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్టు, హ్యాకర్లె అలా ప్రకటించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దీనిపై మాట్లాడడానికి సోనీ ప్రతినిధి నిరాకరించారు. ఈ మధ్య కాలంలో సుందర్ పిచాయ్, మార్క్ జుకెర్ బర్గ్ వంటి వారి ఖాతాలు హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ప్రచారం కోసం ఇలా ఆదరణ ఉన్నవారి అకౌంట్లు హ్యాక్ చేయడం దగ్గరదారిగా హ్యాకర్లు భావిస్తుండడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడం విశేషం. ' 'బేబీ వన్ మోర్ టైమ్' పాటతో కెరటంలా వచ్చిన బ్రిట్నీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు.