: నాకు ఇంత గౌరవమా? అర్హుడినో, కాదో తెలియడం లేదు: షారూఖ్ భావోద్వేగం
బాలీవుడ్ బాద్షా, హీరో షారూఖ్ ఖాన్ కు మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ఈ ఉదయం వర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో షారూఖ్ డాక్టరేట్ ను అందుకున్నారు. ఆపై షారూఖ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇంతటి గొప్ప అవార్డును తాను అందుకోవడాన్ని చూసేందుకు తన తల్లిదండ్రులు జీవించి ఉంటే బాగుండేదని అన్నారు. తనకు ఇంత గౌరవం లభిస్తుందని అనుకోలేదని, దీనికి తాను అర్హుడినో, కాదో తెలియడం లేదని అన్నారు. తనను గుర్తించినందుకు వర్శిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతమంది విద్యార్థులను కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి కవితలు రాస్తారని, ఆయనకు మౌలానా సాబ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. తన తల్లి జన్మించిన గడ్డపై డాక్టరేట్ ను అందుకోవడం, విద్యాభివృద్ధిపై తన బాధ్యతను మరింతగా పెంచిందని షారూఖ్ వ్యాఖ్యానించారు. తన శక్తిమేరకు దేశంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.