: కొత్త సంవత్సరం వచ్చే లోగా తిరుపతి నుంచి ప్రారంభమయ్యే కొత్త రైళ్లివి!
నెలాఖరులోపు తిరుపతి నుంచి పలు కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29న తిరుపతి నుంచి గోవాకు (వాస్కోడగామా)కు ఓ కొత్త రైలును రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించనున్నారు. మరుసటి రోజు అంటే 30వ తేదీన తిరుపతి నుంచి విశాఖపట్నానికి డబుల్ డెక్కర్ రైలును విజయవాడలో ఆయన ప్రారంభిస్తారు. వాస్కోడగామాకు నడిచే సూపర్ ఫాస్ట్ రైలు తిరుపతి నుంచి గోవాకు వారంలో రెండు మార్లు నడుస్తుంది. మిగిలిన రోజుల్లో గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చి వెళుతుంది. ఈ రైలు తిరుపతి - గోవా - హైదరాబాద్ మధ్య త్రికోణ మార్గంలో ప్రయాణించనుంది. దీనిలో సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్ క్లాస్, జనరల్ బోగీలుంటాయి. గతంలో కాచిగూడ - గుంటూరు, కాచిగూడ - తిరుపతి మధ్య తిరిగిన డబుల్ డెక్కర్ రైలునే ఇప్పుడు విశాఖపట్నం - తిరుపతి మధ్య నడిపించనున్నారు.