: ఇది సినిమా స్టోరీ కాదు.. కానీ అచ్చం అలాంటిదే.. జైలులో మొద‌లైన ప్రేమ క‌థ‌.. బెంగళూరును వ‌ణికిస్తున్న జంట‌!


సినిమా.. అదో కాల్పనిక జగత్తు! క‌థ‌ నుంచి ప్ర‌తీదీ క‌ల్పిత‌మే. అందుకే అవి అంత‌ బాగుంటాయి. మ‌రి అటువంటి ఘ‌ట‌న‌లే నిజ‌జీవితంలోనూ జ‌రిగితే.. ఊహించ‌డం కొంచెం క‌ష్ట‌మే అయినా బెంగ‌ళూరులో ఇది జ‌రిగింది. జైలులో మొద‌లైన క‌థ ఇప్పుడు న‌గ‌రాన్ని బెంబేలెత్తిస్తోంది. ఇక అస‌లు క‌థ‌లోకి వెళ్తే..

2011లో దోపిడీ ముఠా నాయ‌కుడు కోటిరెడ్డి అరెస్టై ప‌ర‌ప్ప‌నా అగ్ర‌హార జైలులో ఉన్నాడు. అత‌డిని కలిసేందుకు కోటిరెడ్డి  సోద‌రి సుమ(25) త‌ర‌చూ జైలుకు వెళ్లేది. ఈ క్ర‌మంలో అదే జైలులో శిక్ష అనుభ‌విస్తున్న రౌడీ షీట‌ర్ రాజా అలియాస్ క్యాట్ రాజా(28)తో ఆమెకు ప‌రిచ‌య‌మైంది. అదికాస్తా ముద‌ర‌డంతో జైలులోనే అత‌డికి సుమ త‌న ప్రేమ గురించి చెప్పేసింది. పిల్లి కళ్ల‌తో చూడ్డానికి కొంచెం డిఫ‌రెంట్‌గా క‌నిపించే రాజా మూడేళ్ల క్రితం జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. వ‌చ్చీ రావ‌డంతోనే సుమ‌ను పెళ్లి చేసుకుని కోటి రెడ్డి దోపిడీ దొంగ‌ల సామ్రాజ్యానికి వార‌సుడ‌య్యాడు. ఆ త‌ర్వాత క్ర‌మంగా ఎదిగిన రాజా ఈ ఏడాది జూలైలో ఓ రాజ‌కీయ నాయ‌కుడి హ‌త్య కేసులో అరెస్టై మ‌ళ్లీ జైలుకు వెళ్లాడు.

భ‌ర్త అరెస్ట్‌తో గ్యాంగ్‌ను త‌న చేతుల్లోకి తీసుకున్న సుమ జైలు నుంచి భ‌ర్త ఇచ్చే సూచ‌న‌ల‌తో నేరాలు కొన‌సాగిస్తూ బెంగ‌ళూరును గ‌డ‌గ‌డలాడిస్తోంది. గ్యాంగులోని 8 మంది సభ్యుల‌ను పోలీసులు అరెస్ట్ చేసినా సుమను మాత్రం అరెస్ట్ చేయలేకపోయారు. దోపిడీ త‌ర్వాత మొత్తం సొమ్మ‌ను ముఠా స‌భ్యులు సుమకు అందిస్తారు. ఆమె లెక్క‌లు వేసి ఎవ‌రికి ఎంతెంత ఇవ్వాల‌నేది నిర్ణ‌యిస్తుంద‌ని బెంగ‌ళూరు రూర‌ల్ డిప్యూటీ ఎస్పీ ఎస్‌కే ఉమేశ్ తెలిపారు. స్థావ‌రాలు మారుస్తూ సుమ పోలీసుల‌కు స‌వాలు విసురుతోంది. రాజా అరెస్ట్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 40 దోపిడీల‌కు పాల్ప‌డిన సుమ గ్యాంగ్ స‌భ్యులు ప‌ట్టుబ‌డుతున్నా దోపిడీలు మాత్రం ఆగ‌డం లేదు. కొత్త‌వారిని నియ‌మించుకుంటూ ముందుకెళ్తున్న సుమ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News