: ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. నగదుపై ఆంక్షలను ఇప్పట్లో తొలగించే ప్రసక్తే లేదన్న ఆర్బీఐ
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిసెంబరు 30 లోపు కరెన్సీ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని, ఇందుకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ పలుమార్లు ప్రకటించారు. మరో నాలుగు రోజుల్లో 30వ తేదీ వచ్చేస్తోంది. ఇక మంచి రోజులు వచ్చేసినట్టే అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఈనెల 30 తర్వాత కూడా నగదు విత్ డ్రాపై ఆంక్షలు కొనసాగుతాయని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. సరిపడా నోట్లు అందుబాటులోకి లేకుండా నగదు విత్‌డ్రాపై ఉన్న పరిమితులు ఎత్తేస్తే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రిజర్వు బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం వారానికి రూ.24 వేల వరకు నగదు డ్రా చేసుకునే అవకాశం ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. బ్యాంకుల వద్ద సరిపడా నగదు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో మరీ లేదనకుండా ఉన్నంతలో సర్దుతున్నాయి. ఈ సమయంలో ఆంక్షలు ఎత్తివేయడం వల్ల మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆర్బీఐ భావిస్తోంది. ఆంక్షలు ఎత్తివేస్తే ప్రజలు మళ్లీ బ్యాంకులపై పడే అవకాశం ఉందని, చిరువ్యాపారులు, కార్పొరెట్ సంస్థలు పెద్ద ఎత్తున నగదు కోరితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకని ఆంక్షలు కొనసాగించడమే మంచిదని నిర్ణయించారు. నగదు లభ్యత పెరిగే కొద్దీ ఆంక్షలను కూడా క్రమంగా సడలిస్తూ పోవాలని ఓ నిర్ణయానికి వచ్చింది. ఇటీవల ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా ఆంక్షలను ఉన్నపళంగా ఎత్తేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే.