: జాతి నిర్మాణం కోసం లాభాల్లో కొంత పన్నుగా చెల్లించాలి: ప్రధాని మోదీ
ఫైనాన్షియల్ మార్కెట్లలో గడించిన లాభాల్లోంచి కొంత జాతి నిర్మాణం కోసం పన్ను రూపంలో చెల్లించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. దేశానికి దీర్ఘకాల ఆర్థిక ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని రాయగఢ్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ నూతన క్యాంపస్ ను ప్రధాని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో దేశ ఆర్థిక రంగాన్ని పూర్తిగా మార్చేసినట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు స్వల్పకాలంలో ఇబ్బందులను కలిగించినా దీర్ఘకాలంలో లాభం కలుగుతుందన్నారు. స్టార్టప్ (నూతన కంపెనీలు)లను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మన ప్రజలకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు సమీకరించే సత్తా తమకుందని కేపిటల్ మార్కెట్లు ఇప్పటికే నిరూపించాయన్నారు. సెక్యూరిటీ మార్కెట్లను చక్కగా నిర్వహించగల దేశంగా భారత్ కీర్తి పొందిందన్నారు.