: విమానంలో ట్రంప్ కుమార్తెకు వేధింపులు.. ప్రయాణికుడిని విమానం నుంచి దించేసిన సిబ్బంది
కుటుంబంతో కలిసి హాలిడే కోసం హవాయి వెళ్తున్న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను విమానంలో వేధించిన వ్యక్తిని సిబ్బంది విమానం నుంచి దించేశారు. గురువారం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని విమాన సిబ్బంది ధ్రువీకరించారు. అయితే అంతకుమించి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. దించివేతకు గురైన ప్రయాణికుడు విమానంలోని ట్రంప్ కుమార్తె ఇవాంకాను చూసి, 'ఓరి భగవంతుడా.. ఇదో పీడకల' అని వ్యాఖ్యానించాడని మరో ప్రయాణికుడు తెలిపాడు. అయితే విమానం నుంచి దింపేసిన వ్యక్తిని మరో విమానంలో పంపించనున్నట్టు జెట్ బ్లూ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మ్యాథ్యూ లాస్నెర్ అనే మహిళ ట్వీట్ చేస్తూ విమానాశ్రయంలో ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్‌డ్ కుష్నెర్‌తో తన భర్త ఘర్షణ పడినట్టు తెలిపారు. 'నా భర్త వారిని వెంబడించి వేధించారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. 'వారు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఈ విమానాన్ని కూడా పాలిస్తామంటే ఎలా?' అని ప్రయాణికుడు వాగ్వాదానికి దిగినట్టు విమాన సిబ్బంది ఒకరు పేర్కొన్నారు.