: 'ఏంటీ! నువ్వు కోహ్లీలా ఆడతావా?' అంటూ తమ ఆటగాడిని కడిగేస్తున్న పాక్ అభిమానులు
పాకిస్తాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ను పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఉతికి ఆరేస్తున్నారు. షెహజాద్ ఎప్పుడు మాట్లాడినా తనను తాను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చుకుని సంతోష పడిపోతుంటాడు. తాను అచ్చం విరాట్ లా ఉంటానని, అతనిలాగే పరుగులు చేస్తానని చెబుతుంటాడు. తాజాగా షెహజాద్ వ్యాఖ్యల గురించి పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు ట్వీట్ చేశాడు. విరాట్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్, కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ లకు వారి జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, తనకు మాత్రం అలా లేదని, తాను కూడా వారిలాగే అడుతానని పేర్కొన్నాడని ఆ ట్వీట్ లో తెలిపాడు.
అంతే, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో షెహజాద్ పై ఫైర్ అయిపోయారు. 'ఏంటీ! నువ్వు కోహ్లీలా ఆడతావా?' అంటూ ఉతికి ఆరేశారు. నువ్వు కోహ్లీ, రూట్, విలియమ్సన్ లతో పోల్చుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆ ముగ్గురితో పోల్చుకునే అర్హత కూడా నీకు లేదని ఓ అభిమాని షెహజాద్ కు హితవు పలికాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్లతో పరుగుల వర్షం కురిపిస్తుండగా, నువ్వు జట్టులో చోటుకోసం నానాపాట్లు పడుతున్నావు...ఎలా కోహ్లీతో పోల్చుకుంటావంటూ ఎద్దేవా చేస్తున్నారు.