: పెత్తనం వద్దు... పరుగులు కావాలి!: ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ పై విమర్శల వర్షం
భారత పర్యటనలో ఘోరంగా ఓటమిపాలైన తరువాత ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టుకు కెప్టెన్ గా ఉండి పరుగులు సాధించి ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలవడంలో విఫలమయ్యాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ విరుచుకుపడ్డాడు. కుక్ నుంచి ఇప్పుడు కెప్టెన్ పెత్తనం అక్కర్లేదని, ఆయన పరుగులు చేస్తే చాలని ఎద్దేవా చేశాడు. ఓపెనింగ్ లో బ్యాటింగ్ కు వచ్చే కుక్, కాసిన్ని పరుగులు చేస్తే, ఆపై వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు. కెప్టెన్ బాధ్యతలు స్వీకరించి, జట్టు పదే పదే ఓడిపోతుంటే, ఆటను ఆస్వాదించడం కష్టమన్న విషయాన్ని అతను గుర్తెరగాలని సలహా ఇచ్చాడు. ఓ నాయకుడిగా కన్నా, ఆటగాడిగా రాణించేందుకు అతను కృషి చేయాలని సూచించాడు. జట్టు మరీ చెత్తగా ఆడుతోందని, ప్రదర్శన ఇలాగే ఉంటే, సమీప భవిష్యత్తులో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మెరుగైన స్థానానికి చేరే అవకాశాలు ఉండవని వాన్ హెచ్చరించాడు.