: ఇలాగైతే భారత లక్ష్యం నెరవేరేది కష్టమే!: నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్
ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉంటే, కేవలం ఒక్క శాతంగా సుమారు 1.3 కోట్ల మంది మాత్రమే ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే, 2030 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను నమోదు చేయాలన్న భారత లక్ష్యం నెరవేరేది కష్టమేనని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న 2.30 లక్షల కోట్ల డాలర్ల స్థాయి నుంచి ఐదు రెట్లు పెరగాలంటే, ఈ తరహా కనిష్ట ఐటీ చెల్లింపుదారులతో సాధ్యమయ్యే పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
నగదురహిత లావాదేవీలపై నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 95 శాతం మంది ప్రజలు నగదు లావాదేవీలకే పరిమితమయ్యారని అమితాబ్ కాంత్ గుర్తు చేశారు. ప్రపంచంలోని టాప్ ఎకానమీల్లో ఇండియాను ఒకటిగా నిలిపే లక్ష్యంతో 26 కోట్ల జన్ ధన్ ఖాతాలను, 20 కోట్ల రూపే కార్డులను ఇచ్చామని, ఇక నగదురహిత వ్యవస్థకు మారాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.