: కొలిక్కి వచ్చిన మాసబ్‌ట్యాంకు కాల్పుల కేసు.. బ్యాంకు ఎండీని కాల్చింది పనివాడి ఫ్రెండే!


హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంకులో జరిగిన కాల్పుల కేసు ఓ కొలిక్కి వచ్చింది. కృష్ణ బీమా సమృద్ధి బ్యాంకు(కేబీఎస్) ఎండీ, సీఈవో మన్మథ్ దలాయ్(60)పై ఆదివారం జరిగిన కాల్పుల కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మన్మథ్ వద్ద పనిచేసే వ్యక్తే ఈ ఘాతుకానికి పథకం పన్నినట్టు పోలీసులు నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

మాసబ్‌ట్యాంకులోని శ్రీదుర్గ కనుముల్లి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్లాట్‌లో మన్మథ్, అతని భార్య మాత్రమే ఉండటాన్ని గమనించిన అతని వద్ద పనిచేసే ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలిసి యజమాని ఇంట్లోని బంగారం, నగదును దోచుకునేందుకు ప్లాన్ వేశాడు. నాటు తుపాకిని  సేకరించి స్నేహితుడికి ఇచ్చిన అతడు దగ్గరుండి యజమాని ఉండే ప్లాట్ వద్దకు తీసుకొచ్చాడు. అయితే తాను కనిపిస్తే ప్రమాదమని భావించిన పథక సూత్రధారి అక్కడి నుంచి తప్పుకుని మిగతా పనిని స్నేహితుడికి అప్పగించాడు.

 ఆదివారం మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఆగంతుకుడు 'సార్‌ను కలవాల'ని అక్కడి వాచ్‌మన్ శంకర్‌తో చెప్పడంతో విషయాన్ని ఇంటర్‌కమ్ ద్వారా దలాయ్‌ భార్యకు తెలిపి నిందితుడికి ఫోన్ ఇచ్చాడు. తాను బ్యాంకు నుంచి వచ్చానని చెప్పడంతో అతడిని తీసుకురావాల్సిందిగా ఆమె వాచ్‌మన్‌కు చెప్పారు. దీంతో ఆగంతుకుడిని ప్లాట్ వద్దకు తీసుకెళ్లాడు. తలుపు తీసిన దలాయ్ భార్యకు తుపాకి చూపించి నగదు, బంగారం ఇవ్వాలంటూ దుండగుడు కాల్పులు ప్రారంభించాడు.

ఓ తూటా గోడకు తాకగా, మరొకటి అప్పుడే లోపలి నుంచి వచ్చిన మన్మథ్ ఎడమ కాలిలోకి దూసుకుపోయింది. భయంతో వారు కేకలు వేయడంతో భయపడిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. డబ్బుల కోసం స్నేహితుడితో కలిసి తానే ఈ ప్లాన్ వేసినట్టు అంగీకరించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు యజమాని వద్ద పనిచేస్తున్న వ్యక్తిని అనుమానించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డబ్బు కోసం తానే ఈ పథకాన్ని రచించినట్టు నిందితుడు అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో కాల్పులు జరిపిన వ్యక్తి కోసం  పోలీసులు గాలింపు మొదలు పెట్టారు.

  • Loading...

More Telugu News