: ఇకపై తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి!
ఇకపై తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తులకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గదుల బుకింగ్, శ్రీవారి ఆర్జిత సేవలతో పాటు దర్శనం టిక్కెట్లు, అంగప్రదక్షిణం టోకెన్ల జారీ, శ్రీవారి సేవకుల నమోదు కోసం ఆధార్ కార్డును స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేస్తూ టీటీడీ తాజా నిర్ణయం తీసుకుంది.
కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్లు మార్గంలో వచ్చే భక్తులకు 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తుంటారు. టీటీడీ తాజా నిర్ణయంతో ఇకపై కాలినడకన వెళ్లే భక్తుడి ఫొటోతో పాటు గుర్తింపుకార్డు నంబరును పొందుపరచి దర్శనం టిక్కెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపుకార్డు నంబరు పొందుపరిచిన యాత్రికులకు మాత్రమే లడ్డూ టోకెన్లు, శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.