: ‘రాయల తెలంగాణ’ ఏర్పడి..కేసీఆర్ మా సీఎం అయితే పరిస్థితి వేరుగా ఉండేది: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
రాయల తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ తమ ముఖ్యమంత్రి అయినట్లయితే పరిస్థితి వేరుగా ఉండేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో వీరిద్దరు ఎదురుపడిన సందర్భంలో వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘వీళ్లు మమ్మల్ని అడవుల పాలు చేశారు. విభజన వల్ల కర్నూల్, అనంతపురం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. మమ్మల్ని కలుపుకుంటే కనీసం మాకు నీళ్లు, బువ్వ దొరికేవి’ అని ఈటలను చూసిన జేసీ అన్నారు.
ఇందుకు ఈటల.. ‘శ్రీశైలం నుంచి నీళ్లు వస్తున్నాయి కదా సార్’ అని స్పందించారు. ‘రాయల తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ మాకు కూడా ముఖ్యమంత్రి అయినట్లయితే పరిస్థితులు వేరుగా ఉండేవి. మేము తెలంగాణ వాళ్లం కాదా? మాకు నీళ్లివ్వవా? అని ప్రశ్నించేవాళ్లం’ అని జేసి అన్నారు. కనీసం రెండు జిల్లాలు అయినా తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని నాడు కేసీఆర్ ను కోరామని ఈ సందర్భంగా జేసీ గుర్తు చేయగా, ఆ రెండు జిల్లాలు తెలంగాణలో కలుస్తాయని తాము కూడా అనుకున్నామని ఈటల అన్నారు.
తెలంగాణలో ఆ రెండు జిల్లాలు కలవకుండా ‘మా రెడ్లే అడ్డుకున్నారు’ అని జేసీ చెప్పుకొచ్చారు. అనంతరం తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి ఛాంబర్ కు వెళ్లిన జేసీని చాయ్ తాగమని టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. దీనికి జేసీ తనదైన శైలిలో స్పందిస్తూ ‘మమ్మల్ని వెళ్లగొట్టిన తర్వాత మీ తెలంగాణ చాయ్ నాకెందుకు?’ అన్నారు నవ్వేస్తూ.