: మోదీని నమ్మాను, ఇలా చేస్తారా?... బ్యాంకు డిపాజిట్ దారుల ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
"నా దగ్గరున్న డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు 30-12-2016 వరకూ సమయం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన సమాచారాన్ని విశ్వసించాను. కానీ వారు తమ మనసు మార్చుకున్నారు" పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు వెళ్లిన రామ్ కుమార్ రామ్ అనే వ్యక్తి, ఇంత ఆలస్యంగా డబ్బును డిపాజిట్ చేస్తున్న కారణాన్ని రాయాలని చెప్పిన చోట రాసిన వాక్యాలివి. తాను బ్యాంకుకు పాత నోట్లను జమ చేసేందుకు వెళితే, తొలుత తీసుకోలేదని, ఆపై ఓ ఫాం ఇచ్చి, దానిలో వివరాలు నింపి ఇవ్వాలని కోరారని, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు పెడుతుందని తాను ఊహించలేక పోయానని, అందువల్లే డబ్బును తీరికగా బ్యాంకులో వేసుకోవచ్చని ఆగానని, రామ్ కుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో చెబితే, అది వైరల్ అయింది.
ఒక్క రామ్ కుమార్ మాత్రమే కాదు, ఎంతో మంది ఇదే విధంగా కారణాన్ని రాసి, ఆపై మోదీ, జైట్లీ మనసు మార్చుకుని కొత్త ఆంక్షలు పెట్టారంటూ ఆరోపిస్తున్నారు. స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్ మరో అడుగు ముందుకేసి, తాను రాసిన కారణాన్ని పిక్చర్ తీసి పోస్టు చేస్తూ, నచ్చితే రీ ట్వీట్ చేయాలని కోరగా, 9 వేల మంది దాన్ని రీట్వీట్ చేయడం గమనార్హం.
"నేను నవంబర్ 8 నుంచి నా ఖాతాలో నగదును డిపాజిట్ చేయలేదు. బ్యాంకుల్లో క్యూ లైన్లు ముగిసిన తరువాత బ్యాంకుకు వెళదామని అనుకున్నాను. డిసెంబర్ 30 వరకూ ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పిన ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రుల మాటలను విశ్వసించాను. వారిప్పుడిలా మాట మారిస్తే నేనేం చేయాలి?" అంటూ యోగేంద్ర ప్రశ్నించారు. ఇక ఈ తరహాలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఇలా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గి, ఈ నిబంధనను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.